Monday 10 February 2014

ముంచుకొస్తున్న మూడో అడుగు...!

 
దేశంలో రెండు పెద్దపార్టీలతో సామన్యుడు విసిగిపోయాడు. దీంతో తనకు లాభం చేకూర్చే మూడో ప్రత్యామ్నాయ పార్టీల కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఎ, బిజెపి నాయకత్వంలోని ఎన్టీయే ల కోటలు బీటలు వారుతుండటంతోమూడో ఫ్రంట్ హడావుడి మళ్లీ మొదలైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,మూడో ప్రత్యామ్నాంయం మాట అనగానే దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలతో మూడో ఫ్రంట్ ముచ్చట్లు ఊపందుకున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీ ను కూలదోసే ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అనే ఆలోచనలో థర్డ్ ఫ్రంట్ నిమగ్నమైంది. అయితే 1991 నుంచి కూడా దేశంలో కాంగ్రెస్, బిజెపి సహాయం లేకుండా జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని వాతావరణం ఉంది. కేంద్రంలో అధికారం కావాలనుకుంటే ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానితో చేయి కలపాల్సిందే. ఇటీవల కొన్ని పార్టీలు ఈ రెండు కూటముల నుంచి దూరం జిరిగాయి దానికితోడు వామపక్షాలు చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయ విధానాలు అంధించాలనే తపనతో థర్డ్ ఫ్రంట్ కు వామపక్షాలు నాయకత్వం వహిస్తాయని జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఒడిశా, అసోంలలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నాయి. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ అధికారంలో ఉంది. అసోంలో అసోం గణపరిషత్ ప్రతిపక్షంలో ఉంది. ఈ రెండు పార్టీలు మాత్రం మూడో ఫ్రంట్‌లో చేరేందుకు ముందుకువస్తాయి. ఒడిశాలో కాంగ్రెస్ ప్రతిపక్షం అయితే, బీజేపీ ఉనికి నామమాత్రమే.

మహారాష్ట్రలో కాంగ్రెస్-నేషనలిస్టు కాంగ్రెస్; బీజేపీ-శివసేన కూటాలు బలంగా ఉన్నాయి. అంటే మూడో ఫ్రంట్ వైపు చూసే శక్తులేవీలేవు. రాజ్ థాకరే తన ఎంఎన్‌ఎస్ పార్టీని మూడోశక్తిగా రూపొందిస్తాడన్న ఆశ లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరెడి బ్యాటరీ లాగా అన్ని ఫ్రంట్‌లకు పనికొస్తాడు. రాష్ట్రంలో చంద్రబాబు మునుపటంత శక్తిమంతుడు కాకపోవడంతో, ఆయన మూడో ఫ్రంట్ ముచ్చట్లకు అంతగా ఊపు రావడం లేదు. అయితే, బాబు మూడో ఫ్రంట్ ఏర్పాటుకు బాగా శ్రమదానం చేయగలడు. కాంగ్రెస్, టీడీపీ కాకుండా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)- ఈ రెండు ప్రాంతీయ పార్టీల హవాయే ఇప్పుడు గట్టిగా వీస్తోంది. కానీ, ఈ రెండు పార్టీలు బాబు ఉండే ఫ్రంట్‌లో చేరే అవకాశం లేదు. అందువల్ల బాబుతో పాటు ఇక్కడ ఏ పార్టీ మూడో ఫ్రంట్ వైపు మొగ్గుచూపుతుందో వేచి చూడాల్సిందే.

గణాంకాల సంగతి

కాంగ్రెసేతర, బీజేపీయేతర రాష్ట్రాలలో దాదాపు 320 మంది ఎంపీలుంటారు. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీలు ప్రాబల్యం తక్కువ కాబట్టి ఈ రెండు పార్టీ లకు 80 సీట్లకు మించిరావడం కష్టం. ఇక మిగిలిన 220 సీట్లు మూడో ప్రత్యా మ్నాయానికే వస్తాయి. ఒడిశా, బెంగాల్, ఆంధ్రఫ్రదేశ్, తమిళనాడులలో బీజే పీకి ఎంపీ సీట్లు దక్కే అవకాశంలేదు. ఇలాగే, తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్, జార్ఖండ్ లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్‌కు వచ్చేవి నామమాత్రమే.

మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలలో దాదాపు 200 లోక్‌సభ స్థానాలున్నాయి. అంటే, 320 లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్, బీజేపీల ప్రాబల్యం బాగా తక్కువ. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీలు ముఖాముఖి తలపడుతూ ఉంటాయి.

ప్రత్యామ్నాయానికి సాధ్యాసాధ్యాలు

ప్రస్తుతానికి ఎటు తేల్చుకోని ములాయంసింగ్, నితీష్‌కుమార్, మమతా బెనర్జీ, చంద్రబాబు ఈ మధ్య మూడో మంత్రం ఉచ్చరిస్తున్నారు. వీళ్లెవరూ బీజేపీతో, కాంగ్రెస్‌తో కలిసే అవకాశం లేదు. బీజేపీకి ఎన్నికల ఎదురుదెబ్బలు తగలడంతో ఈ మధ్య వీరికి కాషాయం కషాయంగా అనిపిస్తుంది. ఇదే విధంగా నవీన్ పట్నాయక్, జయలలిత కూడా ఏ కూటమి వైపు మొగ్గకుండా కొనసాగాలను కుంటున్నారు. తమ తమ రాష్ట్రాలలో ఈ నాయకులకు మరొక పార్టీతో పొత్తు అవసరంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క వైఎస్సార్‌సీపీకి మాత్రమే అలాంటి తాహతు ఉంది.

దాదాపు 300 స్థానాలలో బలంగా ఉన్న మూడో ఫ్రంట్ పార్టీలకు కనీసం 200 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్, బీజేపీల బలం కంటే ఎక్కువే కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నుంచి మూడో ఫ్రంట్‌కే మొదటి అవకాశం వస్తుంది. ఎన్నిలకు ముందు ఒక కూటమిగా తయారైతే, ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం తమకేవస్తుందని ఈ నాయకులంతా భావిస్తున్నారు. 2014 ఎన్నికలలో ఈ అర్హత సంపాదించడం అన్ని పార్టీల లక్ష్యంగా ఉంటుంది. ఇటీవలి సంప్రదాయం ప్రకారం, ఏ పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే, రాష్ట్రపతి నుంచి పిలుపు ఆ పార్టీకి లేదా కూటమికి వస్తుంది.

కాంగ్రెస్ నితీష్‌ను రోజూ ఆకాశానికెత్తడం, జార్ఖండ్ ముక్తిమోర్చాతో మళ్లీ మాట కలపడం కూడా ఇందుకే. ఒక ముఖ్యమైన భాగస్వామి నితీష్‌ను దూరం చేసుకుని బీజేపీ బలహీనపడింది. బీజేపీ కూటమిలో ఇప్పుడు శివసేన, అకాలీ దళ్ తప్ప మరొక పార్టీలేదు. హర్యానాకు చెందిన ఓమ్‌ప్రకాశ్ చౌతాలా, అసోం గణపరిషత్, జార్ఖండ్ ముక్తిమోర్చా, డీఎంకే ఇలా దూరమైనవే. కొత్త పార్టీలేవీ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగాలేవు. ఈ లోటు భర్తీ చేసుకునేందుకు బీజేపీ ఇప్పుడు నరేంద్రమోడీని ఊరూరా ఊరేగించేందుకు సిద్ధమవుతూ ఉంది. వచ్చే ఎన్నికలలో పూర్తి ఆధిక్యత రాకపోయినా, అందరికంటే పెద్ద పార్టీ అర్హత వస్తే చాలు, రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందుతుంది. అందువల్ల కాంగ్రెస్‌తో ముఖాముఖి పోటీ ఉన్న 200 స్థానాలలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు బీజేపీ మోడీ ప్రయోగానికి పూనుకుంటోంది. ఈ స్థానాలలో వెనకబడితే, పార్లమెంటులో అతిపెద్ద పార్టీ హోదా దక్కే అవకాశాన్ని కాంగ్రెస్ కోల్పోతుంది. బీహార్, బెంగాల్, అసోం, ఒడిశాలలో మోడీ చెల్లని కాసే అయినా, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో మోడీ మ్యాజిక్ పనిచేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా యుద్ధాలన్నింటినీ పుర్తిగా గెలవాల్సిన పనిలేదు. శత్రువు ముందుకు కదలకుండా ఆపగలిగితే చాలు యుద్ధం గెలిచినట్లే. కొన్ని కీలకమైన రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగిలితే ఆ పార్టీకి అతిపెద్ద పార్టీ హోదా గల్లంతవుతుంది. అందువల్ల 2014లో ప్రధాన పోటీ ఉండేది కేవలం 200 స్థానాలలోనే.

200 స్థానాలూ కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించేవే. ఈ స్థానాలలో కాంగ్రెస్ వెనుకంజ వేస్తే మూడో ఫ్రంట్ ముందుకొస్తుంది. మూడో ఫ్రంట్, బీజేపీల మధ్యనే పోటీ ఉంటుంది. రాష్ట్రపతి మూడో ఫ్రంట్‌ను ప్రభుత్వం ఏర్పా టు చేసేందుకు ఆహ్వానిస్తే బీజేపీకి అభ్యంతరంలేదు. ఎందుకంటే, ఈ ఫ్రం ట్‌తో లావాదేవీలు కష్టంకాదు. వీలుంటే, కనీస ఉమ్మడి ప్రణాళికతో మూడో ఫ్రంట్‌లో తానూ భాగస్వామి కావచ్చు. లేదా బయట నుంచి మద్దతేనిచ్చి కాం గ్రెస్‌ను తరిమేయవచ్చు. బీజేపీ వ్యూహం మూడో ఫ్రంట్‌కే ప్రయోజనం. ఇక తన సెక్యులర్ ‘అజెండా’ను ముందుకు తీసుకుపోయేందుకు, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూడా మూడో ఫ్రంట్‌కే మద్దతివ్వాల్సివస్తుంది. కాబట్టి కాంగ్రెస్‌కు కమలం ఒక బూచిలా కనపడేట్లు చేయడం మూడో ఫ్రంట్ నేతల విధి. మోడీ రాకతో కూడా ఈ పని సులవ వుతుంది. మోడీ భయం వల్ల కాంగ్రెస్ అనివార్యంగా మూడో ఫ్రంట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయదు.

No comments:

Post a Comment